: శ్రీనగర్‌లో కర్ఫ్యూ ఎత్తివేత... ఊపిరి పీల్చుకున్న ప్రజలు
హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌తో 17 రోజులుగా కల్లోలంగా మారిన కశ్మీర్ వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో ఆ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లో కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ఈరోజు ప్రకటించారు. ఆంక్షలు ఎత్తివేయడంతో శ్రీనగర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నిలిపి వేసిన మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరించారు. వస్త్ర, మొబైల్, కిరాణా దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అనంత్‌నాగ్ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో అక్కడ మాత్రం కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూ పరిస్థితులతో పెల్లెట్ గాయాలైన వారికి క్షమాపణ చెబుతున్నట్లు సీఆర్ఫీపీఎఫ్ డీజీ పేర్కొన్నారు. కశ్మీర్లో చెలరేగిన ఆందోళనల కారణంగా భద్రతా బలగాల కాల్పులలో 47మంది మృతి చెందగా, 5500 మంది గాయపడ్డారు. మరోవైపు వేర్పాటువాద నాయకులు రేపు ర్యాలీ తీయడానికి పిలుపునిచ్చారు.