: ర్యాలీకి యత్నం.. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీని ఎన్ కౌంటర్ చేయడంతో జమ్ము కశ్మీర్‌లో వాతావరణం కల్లోలంగా మారిన నేపథ్యంలో వేర్పాటు వాద నేతల్ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అయినప్పటికీ సదరు నేత ఈరోజు ఓ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ అలీ షా గిలానీ.. 1931నాటి నియంత పాలనలో ప్రాణాలు కోల్పోయిన ముస్లిం అమర వీరులకు మద్దతుగా ఈరోజు ర్యాలీ తీయడానికి ప్రయత్నించారని, అనంత్ నాగ్లో ఉన్న శ్మశాన వాటిక వైపుగా ర్యాలీ తీసేందుకు వెళుతుండగా ఆయనను ఎయిర్ పోర్ట్ రోడ్డులో అడ్డుకొని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో పెట్టిన నిబంధనలను ఉల్లంఘించడంతోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.