: ప్రతిపక్షాలది రాజకీయ స్వార్థం తప్ప మీ మీద ప్రేమ కాదు: హరీశ్‌రావు
మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీ అంశంపై ప్రతిపక్షాలు, టీజేఏసీ భగ్గుమంటోన్న నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కరవు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టులు చేపట్టాం.. వాటిని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి’ అని అన్నారు. ‘మల్లన్నసాగర్‌పై ప్రతిపక్షాలు చేస్తోన్న ఆందోళన వారి రాజకీయ స్వార్థం కోసమే తప్ప మీ మీద ప్రేమ కాదు’ అని ఆయన భూనిర్వాసితులనుద్దేశించి అన్నారు. రైతులు సంయమనం పాటించాలని హరీశ్‌రావు సూచించారు. ‘ప్రభుత్వం మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది’ అని అన్నారు. ప్రతిపక్షాలవి అనవసర రాద్ధాంతమని అన్నారు. రైతులని వారు రెచ్చగొడుతున్నారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు నీరందుతుందని అన్నారు. నిర్వాసితులకు తమ సర్కార్ మంచి పరిహారాన్ని అందిస్తుందని, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. తాము బలవంతంగా భూసమీకరణ చేయడం లేదని హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే తాము కొన్ని గ్రామాల ప్రజలతో చర్చించామని, మిగతా గ్రామాలతో కూడా చర్చిస్తామని ఆయన తెలిపారు. వారికి పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని సూచించారు. ప్రభుత్వం రైతులకి అన్యాయం చేయబోదని ఆయన అన్నారు.