: భర్తతో గొడవ పడి కారు దిగిన భార్యను లాక్కెళ్లి చంపేసిన పెద్దపులి... సీసీ కెమెరాలో సంఘటన దృశ్యాలు!
బీజింగ్ అభయారణ్యంలో ఘోరం జరిగిపోయింది. వైల్డ్ లైఫ్ పార్కులో కారులో ప్రయాణిస్తు వేళ, తన భర్తతో గొడవ పడి కారు దిగిన యువతిని, వెనుక నుంచి వచ్చిన పెద్దపులి లాక్కెళ్లి చంపేసింది. బీజింగ్ సమీపంలోని బడాలింగ్ వైల్డ్ లైఫ్ వరల్డ్ లో ఈ ఘటన జరిగినట్టు చైనా న్యూస్ డాట్ కామ్ వెల్లడించింది. కారులో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉండగా, వారు కారు దిగి సాయం చేసేందుకు ప్రయత్నించేలోపే మరో పులి కూడా దాడి చేసి ఆమెను చంపేసినట్టు తెలుస్తోంది. పెద్దపులి దాడి ఘటన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. పెద్దపులులు స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉండే పార్కులో కేవలం కార్లలో మాత్రమే సందర్శకులు తిరగవచ్చు. ఎవరూ కిందకు దిగేందుకు అనుమతి ఉండదు. పార్కులోని భద్రతాదళాలు క్షణాల్లో స్పందించి పులిని వెంటాడినప్పటికీ యువతి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. పార్కును తాత్కాలికంగా మూసివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదే పార్కులో ఆగస్టు 2014లో ఓ సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన పులులు ఆయన్ను కూడా చంపేశాయి.