: కేఈ తారాజువ్వను వెలిగించగానే... ఒక్క నిమిషంలో 1,400 మొక్కలను నాటిన విద్యార్థులు!
రాయలసీమ ముఖద్వారం కర్నూలు నగరంలో నిన్న ఓ వినూత్న కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన విద్యార్థులు ఒకే ఒక్క నిమిషంలో 1,400 మొక్కలను నాటేశారు. నగరంలోని జోహరాపురం ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి రూపకల్పన చేశారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కాలనీలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా అప్పటికే గుంతలు తీసి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. కేఈ కృష్ణమూర్తి కార్యక్రమానికి ప్రారంభ సూచకంగా తారాజువ్వను వెలిగించగానే రంగంలోకి దిగిపోయిన విద్యార్థులు నిమిషం వ్యవధిలో మొత్తం 1,400 మొక్కలను నాటేసి వాటికి నీరు పోశారు.