: పుష్కర యాత్రికులకు మంచి ఆహారం అందించాలి: సమీక్షలో సీఎం చంద్రబాబు
వచ్చే నెల 12 వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ బాబు.ఎ, పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్, ఇంటెలిజెన్స్ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పుష్కరాల్లో యాత్రికులకు అందించే సేవా కార్యక్రమాలపై ప్రధానంగా సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు కూడా నాణ్యమైన ఆహారం అందించాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని విజయవాడ నగర పౌరులకు విజ్ఞప్తి చేశారు. పుష్కర యాత్రికులకు సంపూర్ణ సహకారం అందించి ఆదరించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 10 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువన సంపూర్ణ శాకాహార ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాలోని ప్రసిద్ధ వంటకాలను యాత్రికులకు రుచి చూపించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, చీఫ్ జస్టిస్ లను పుష్కరాలకు ఆహ్వానించే విషయమై చంద్రబాబు సమీక్షించారు.