: 'కబాలి' తొలి రోజు కలెక్షన్ రూ. 250 కోట్లు: ప్రకటించిన నిర్మాత కలైపులి ఎస్ థాను
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కబాలి' తొలి రోజునే రూ. 250 కోట్లను వసూలు చేసిందని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రూ. 100 కోట్లు వసూలైనాయని, మిగతా అన్ని చోట్ల నుంచి రూ. 150 కోట్లు వచ్చిందని ఆయన వెల్లడించారు. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్లర్లాండ్, డెన్మార్క్, సాలెండ్, స్వీడన్, సౌతాఫ్రికా, నైజీరియా, మలేషియా తదితర దేశాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, రజనీ స్టామినాకు ఇదే నిదర్శనమని ఆయన తెలిపారు. ఓ భారత నటుడి సినిమాకు తొలి రోజున వచ్చిన అత్యధిక కలెక్షన్లు ఇవేనని ప్రకటించారు. యూఎస్ లో 480, మలేషియాలో 490, గల్ఫ్ దేశాల్లో 500 థియేటర్లలో చిత్రం విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల స్క్రీన్లలో సినిమా నడుస్తోందని చెప్పారు.