: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రెండు రోజుల్లో 52 మంది మృత్యువాత... 'తప్పు మాది కాదు విద్యుత్ శాఖదే' అంటున్న వైద్యులు


హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. శుక్రవారం నాడు 21 మంది చనిపోగా, శనివారం నాడు 31 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇందుకు కారణం విద్యుత్ కొరతేనని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లే ఇక్కడకు వస్తుంటారని, కరెంటు లేక వారికి సరైన సమయంలో చికిత్స లభించడం లేదని చెప్పారు. వివిధ వైద్య పరికరాలు పనిచేసేందుకు అవసరమైన కరెంటు ఉండటం లేదని, రోజుకు 150 మంది క్లిష్ట ఆరోగ్య పరిస్థితిలో ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. ఉన్న జనరేటర్లు అన్ని అవసరాలనూ తీర్చడం లేదని వెల్లడించారు. ఆసుపత్రిలో పెరుగుతున్న మరణాలపై ఆరా తీసేందుకు వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నామని, అదనపు జనరేటర్లు తెప్పిస్తున్నామని వివరించారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయని, సిబ్బందికి కొరత లేదని చెప్పారు. కాగా, శుక్రవారం నాడు 5 గంటలకు పైగా, శనివారం నాడు ఆరు గంటలకు పైగా విద్యుత్ సరఫరా ఆగగా, కొవ్వోత్తుల వెలుగులో వైద్యులు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News