: విమానాల పూలజల్లుల మధ్య ఘనంగా కేటీఆర్ జన్మదినం
ప్రత్యేక విమానాలు పూల జల్లులను కురిపిస్తున్న వేళ, తెలంగాణ ఐటీ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు జన్మదిన వేడుకలను తెరాస శ్రేణులు వైభవంగా జరుపుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యకర్తలు "జై తెలంగాణ", "లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేటీఆర్ లాంగ్ లివ్" అంటూ నినాదాలు చేస్తుండగా, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఘనంగా జన్మదినోత్సవాన్ని జరిపించారు. ఇదే సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం ఆ ప్రాంతంలో కేటీఆర్ చిత్రాలతో పాటు పూల వర్షాన్ని కురిపించింది. పై నుంచి తెలంగాణ మ్యాప్ ఆకారంలో కేటీఆర్ చిత్రాన్ని ముద్రించిన కాగితాలు పడుతుంటే, వాటిని అందుకునేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై తయారు చేసిన ప్రత్యేక గీతాన్ని టీఆర్ఎస్ విడుదల చేసింది.