: యూపీలో అద్భుతం జరుగుతుంది చూడండి: రాజ్ బబ్బర్ జోస్యం
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో అద్భుతం జరగనుందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాజ్ బబ్బర్ జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో గత 20 ఏళ్ల రాజకీయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజలు తమ మైండ్ సెట్ ను కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చుకున్నారని మూడు సార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన ఆయన అంటున్నారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజలతో మమేకమై ఉన్నామని, వారిచ్చే తీర్పు తనకు తెలుసునని అన్నారు. 2007లో బీఎస్పీ క్లీన్ స్వీప్ చేయగా, 2012లో సమాజ్ వాదీ పార్టీ, ఆపై 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేశాయని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు అవకాశం తమదని, వచ్చే ఎన్నికల్లో కులాలు, ప్రాంతాల వారీగా గంపగుత్త ఓట్లు పడే అవకాశాలు లేవని అన్నారు. కుల రాజకీయానికి తాము దూరమని అన్నారు. 73 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతికి పాల్పడుతున్న నేతల సంఖ్య పెరిగిపోయిందని, ఎందరో స్టింగ్ ఆపరేషన్లకు దొరికిపోయారని చెప్పారు. వీరి పాలనలో విసిగిన ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.