: సముద్రంలో తేలియాడుతున్న వస్తువు... వాయుసేన విమానం కూలినట్టేనా?
శుక్రవారం నాడు చెన్నై తాంబరం విమానాశ్రయం నుంచి పోర్టు బ్లెయిర్ బయలుదేరి బంగాళాఖాతం ప్రాంతంలో అదృశ్యమైన భారత వాయుసేన విమానం నడిసముద్రంలో కుప్పకూలిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. చెన్నైకి 145 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపడుతున్న యుద్ధ నౌకలకు సముద్రంలో తేలియాడుతున్న ఓ వస్తువు కనిపించింది. ఈ మేరకు వైమానిక శాఖ నుంచి సమాచారం లభించడంతో, ఇది మాయమైన విమానం శకలమా? కాదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు అధికారులు ఆ ప్రాంతానికి నౌకలను పంపారు. వివిధ రకాల మార్గాల్లో విమానం ఆచూకీని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. విమాన ఆచూకీని సాధ్యమైనంత త్వరగా కనుక్కునేందుకు రంగంలోకి దిగిన ఇస్రో, రాడార్ చిత్రాల ఉపగ్రహం రిశాట్ ను రంగంలోకి దించింది. చీకటిగా ఉన్నా, మేఘాలు దట్టంగా ఉన్నా, సముద్ర భూగర్భంలో ఈ రాడార్ స్పష్టమైన చిత్రాలను తీయగలదు. అయితే, విమానంలో ఉండే బీకాన్ ల్యాంప్ నుంచి ఎలాంటి సంకేతాలూ వెలువడటం లేదని, అందువల్లే విమానం జాడ తెలుసుకోవడం ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు.