: యంగ్ టైగర్ ‘తారక్’ని ముఖ్యమంత్రిగా చూపిస్తోన్న గూగుల్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆధునిక మానవుని జీవితంలో ఎంతగా భాగమయిపోయిందో తెలిసిందే. ప్రపంచంలోని ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ మొదట గుర్తుకొచ్చేది గూగులే. అటువంటి గూగుల్ లో ఒక్కోసారి కొన్ని విచిత్రాలు కనిపిస్తుంటాయి. ఇటీవలే గూగుల్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును టాప్ టెన్ క్రిమినల్స్ లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపమో, నిర్లక్ష్య ధోరణో కానీ ఇటువంటివి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా తెలుగు సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని గూగుల్ ముఖ్యమంత్రిని చేసేసింది! అద్భుతమైన నటన, డ్యాన్స్‌లతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తెలుగు సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని సన్నిహితులు, అభిమానులు ముద్దుగా ‘తారక్’ అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. గూగుల్ ట్రాన్స్‌లేటర్‌లో ఇప్పుడు తారక్ (TARAK) అని ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే అది తెలుగులో ముఖ్యమంత్రిగా చూపిస్తోంది. దీంతో ఆయన అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. మరోపక్క, ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఇలాంటి విచిత్రాలు చేయడం పట్ల నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.