: కళానికేతన్ డైరెక్టర్ కు బెయిల్!... పోలీసు కస్టడీలోనే ఎండీ లీలాకుమార్!
చేనేత కార్మికులను నిండా ముంచేసిన కేసులో ప్రముఖ వస్త్ర దుకాణం కళానికేతన్ కేసులో బెయిళ్ల పర్వం మొదలైంది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని వందలాది మంది చేనేత కార్మికుల వద్ద వస్త్రాలు కొనుగోలు చేసిన కళానికేతన్ ఎండీ లీలాకుమార్, ఆయన భార్య, సంస్థ డైరెక్టర్ లక్ష్మీశారదలు డబ్బు చెల్లించకుండా సతాయించారు. ఈ క్రమంలో బాధిత చేనేత కార్మికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న ధర్మవరం పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని లక్ష్మీశారద దాఖలు చేసిన పిటిషన్ కు ధర్మవరం కోర్టు సానుకూలంగా స్పందించింది. నిన్ననే ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మరికాసేపట్లో ఆమె అనంతపురం జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న లీలా కుమార్ కు మాత్రం ఇంకా పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. గత నెలలో నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులకు ఆయన విచారణలో ఏమాత్రం సహకరించలేదట. దీంతో మరోమారు లీలా కుమార్ ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వినతికి కూడా ధర్మవరం కోర్టు సమ్మతి తెలిసింది. దీంతో నిన్ననే ఆయనను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు అంశాలపై విచారించారు. తాజాగా సంస్థకు ఆస్తులున్న ప్రాంతాలకు ఆయనను తీసుకెళ్లి విచారించేందుకు ధర్మవరం పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వెరసి కాస్తంత ముందుగా అరెస్టైన లక్ష్మీశారదకు ముందుగా బెయిల్ మంజూరైపోయింది. మరి లీలాకుమార్ కు ఎప్పుడు బెయిల్ వస్తుందో చూడాలి.