: చైతన్యపురిలోని శ్రీ చైతన్య విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం కర్రలతో దాడి.. తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్‌లో కార్పొరేట్ కాలేజీల పైశాచికం మరోసారి బయట పడింది. దిల్‌సుఖ్ నగర్ చైతన్యపురిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులపై యాజమాన్యం దాడి చేసింది. హోం సిక్ (ఇంటి మీద బెంగ) సెలవులు అడిగినందుకు సుమారు 15 మంది విద్యార్థులపై కర్రలతో ఆ కాలేజీ యాజమాన్యం దాడికి దిగడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. విద్యార్థులపై అకారణంగా దాడి చేశారని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులు లిఖిత పూర్వకంగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. సెలవు అడిగినందుకు విద్యార్థులపై దాడి చేస్తారా..? అంటూ ఏబీవీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకొని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో భారీగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా బుద్ధులు చెప్పాల్సిన వారు పిల్లలపై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కాలేజీ గుర్తింపుని రద్దు చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.