: కాశ్మీర్ పాకిస్థాన్ లో కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నా: నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
కాశ్మీర్, పాకిస్థాన్ లో కలిసే రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవాజ్ షరిఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ఆజాద్ జమ్మూ కశ్మీర్ గా పాకిస్థాన్ పేర్కొనే ఆ ప్రాంతంలో నవాజ్ షరీఫ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. లండన్ లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం నవాజ్ షరీఫ్ తొలిసారి బహిరంగంగా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం భారత్ లో పోరాడుతున్న వారిని మరచిపోకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో సైనిక పాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ దేశంలో పోస్టర్లు అతికించిన నేపథ్యంలో, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. అలాగే, ప్రతిపక్షాలు బలపడుతున్నాయన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గత వారం రోజులుగా పాక్ తీరుపై మండిపడ్డ భారత్, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని ఘాటుగా హెచ్చరించి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఆయన తన పదవి కాపాడుకోవడంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ...రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.