: కేవీపీ బిల్లు ప్రస్తావనకు వచ్చేనా?... రాజ్యసభ ముందుకు నేడు 18 బిల్లులు!


రాజ్యసభలో సభ్యులు ప్రతిపాదించే ప్రైవేటు బిల్లులపై సమావేశాలు జరిగే సమయంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత చర్చ జరుగుతుంది. చర్చ ముగిసిన తర్వాత ఆయా బిల్లులపై ఓటింగ్ కూడా జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకే ఈ చర్చలకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో భాగంగా సభ ముందుకు ఏకంగా 18 ప్రైవేటు బిల్లులు రానున్నాయి. వీటిలో ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన బిల్లు కూడా ఉంది. 13 బిల్లులపై చర్చ జరిగిన తర్వాత 14వ బిల్లుగా ఈ బిల్లు ప్రస్తావనకు రానుంది. ఇప్పటికే గడచిన సమావేశాల్లో భాగంగా దీనిపై చర్చ ముగిసింది. ఆయా పార్టీ సభ్యులతో పాటు కేవీపీ కూడా తన వాదన వినిపించారు. ఈ క్రమంలో నేడు సభలో ఈ బిల్లు ప్రస్తావనకు వస్తే... చర్చ లేకుండానే ఓటింగ్ జరుగుతుంది. అయితే 13 బిల్లుల ప్రస్తావన ముగిసి 14వ బిల్లుగా ఉన్న కేవీపీ బిల్లు అసలు సభలో ప్రస్తావనకు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తప్పనిసరిగా ఈ బిల్లుపై ఓటింగ్ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టే అవకాశాలున్నాయి. అదే సమయంలో 14వ అంశంగా ఉన్న ఈ బిల్లు ప్రస్తావనకు వచ్చే అవకాశమే లేదన్న భావనలో బీజేపీ ఉంది. ఎందుకైనా మంచిదని భావించిన అధికార పార్టీ ప్రైవేటు బిల్లుల ప్రస్తావన సమయంలో సభ్యులంతా సభకు హాజరుకావాలని విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేవీపీ బిల్లు ప్రస్తావనకు వస్తుందా? రాదా? అన్న విషయాన్ని పక్కనబెడితే... నేటి సమావేశాల్లో ఈ బిల్లే హాట్ టాపిక్ లా మారింది.

  • Loading...

More Telugu News