: సర్కారు దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది: గుజరాత్లో కేజ్రీవాల్
పదిరోజుల క్రితం గుజరాత్లోని ఉనాలో దళిత యువకులను గోమాంసం పంపిణీ చేస్తున్నారంటూ గోసంరక్షణ సంస్థ సభ్యులు కట్టేసి కొట్టిన సంగతి తెలిసిందే. వారిని అర్ధనగ్నంగా మార్చి, ఓ కారుకి వారి చేతులని కట్టేసి కొట్టడంతో బాధితుల్లో ఏడుగురు ఆత్మాహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. బాధిత యువకులను నిన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించగా, నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గుజరాత్‌కి చేరుకొని వారిని పరామర్శించారు. రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకులతో కేజ్రీవాల్ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిచేసిన వారిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. పోలీసులు ఉదాసీన వైఖరిని కనబరుస్తుండడం ప్రభుత్వంపై అనుమానాలు పెంచేలా ఉందని ఆయన ఆరోపించారు. ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దాడికి పాల్పడ్డ వారిని చట్టం ముందు నిలబెట్టాలని ఆయన అన్నారు. గుజరాత్ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా మారిందని ఆయన ఆరోపించారు.