: యూపీలో దారుణం... తమ చెల్లితో చనువుగా ఉన్నాడని 14 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన బాలిక సోదరులు


బాలికతో చనువుగా ఉన్న బాలుడిని అత్యంత దారుణంగా చంపి పాతిపెట్టిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని కవాల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీపాల్ సైనీ, షకీల్ అహ్మద్ కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. వారి రెండు ఇళ్లకు మధ్య గోడ ఒకటే అడ్డు. అహ్మద్ 14 ఏళ్ల కుమారుడు ఎర్షాద్‌కు తన సోదరి(15)తో సంబంధం ఉందని భావించిన సైనీ కుమారులు ఇద్దరు తమ అంకుల్‌తో కలిసి ఎర్షాద్‌ను గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టారు. సోమవారం స్కూలుకు వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో షకీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి అదృశ్యం పోలీసులకు సవాలుగా మారింది. అయితే బాలుడు సెల్‌ఫోన్ ఉపయోగించేవాడని తెలుసుకున్న పోలీసులు అతడి కాల్ లిస్ట్‌ను ఆరాతీయగా తరచూ ఓ నెంబరుకు ఫోన్ చేశావాడని తెలిసింది. దీంతో దర్యాప్తు ప్రారంభించారు. బాలుడు ఫోన్ చేసే నంబరు, అతడు వాడుతున్న నంబరు రెండూ అతడి పేరుతోనే రిజిస్టర్ అయి ఉండడంతో అనుమానించారు. రెండు రోజుల క్రితం పక్కింటి బాలికతో నడుస్తూ వెళ్లడం చూశామని కొందరు చెప్పారు. దీంతో నిఘాపెట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి బాలుడిని అపహరించిన తర్వాత గొంతు నులిమి చంపేసినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. అనంతరం ఎర్షాద్ మృతదేహాన్ని పాతిపెట్టినట్టు అంగీకరించారు. తమ సోదరితో సంబంధం కలిగి ఉండడంతో తట్టుకోలేకే ఈ పనికి పాల్పడినట్టు వివరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పవన్, మోహన్ సైనీ, వారి అంకుల్‌ను అరెస్ట్ చేశారు. బాలుడి హత్య విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లలో ఈ గ్రామంలో 63 మంది మృతి చెందారు. 50 వేలమంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత అటువంటి ఉద్రిక్త పరిస్థితే గురువారం ఉదయం గ్రామంలో నెలకొంది. దీంతో అదనపు బలగాలను మోహరించినట్టు మీరట్ జోన్ ఐజీ సుజీత్ పాండే తెలిపారు.

  • Loading...

More Telugu News