: చెలరేగిన కోహ్లీ!... విండీస్ తో ఫస్ట్ టెస్టు తొలి రోజు భారత్ దే పైచేయి!


కరీబియన్ గడ్డపై ‘హ్యాట్రిక్ సిరీస్’పై కన్నేసిన టీమిండియా తొలి రోజే తన ఉద్దేశాన్ని ప్రత్యర్థికి చెప్పకనే చెప్పింది. వెస్టిండిస్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్ నిన్న రాత్రి వెస్టిండిస్ లోని అంటిగ్వాలో మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మురళీ విజయ్ (7)తో పాటు కుదురుగా ఆడతాడన్న అంచనాలున్న ఛటేశ్వర్ పుజారా (16) విఫలమైనా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (84)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ(143 నాటౌట్) చెలరేగిపోయారు. సెంచరీకి చేరువైన ధావన్ శతకం చేయకుండానే వెనుదిరగగా, కోహ్లీ మాత్రం బ్యాటు ఝుళిపించాడు. తొలి రోజంతా క్రీజులోనే ఉండిపోయిన టీమిండియా కెప్టెన్... రెండో రోజు ఆటను కూడా ప్రారంభించనున్నాడు. ధావన్ కూడా వెనుదిరగడంతో కోహ్లీతో రవిచంద్రన్ అశ్విన్ (18) జత కలిశాడు. తన ఇన్నింగ్స్ లో మొత్తం 197 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ... 143 పరుగులు సాధించాడు. ఈ సెంచరీతో టెస్టుల్లో 12వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ... టెస్టుల్లో 3 వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 302 పరుగులు చేసిన కోహ్లీ సేన నాలుగు వికెట్లు చేజార్చుకుంది. వెరసి తొలి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం కొనసాగింది.

  • Loading...

More Telugu News