: ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్ సహాయకుడు అరెస్ట్.. యువతను ఐఎస్‌వైపు ఆకర్షిస్తున్నారని ఆరోపణ


వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్‌ సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ యువతను ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)వైపు ఆకర్షిస్తున్నారనే ఆరోపణలపై ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) సభ్యుడు అర్షిద్ ఖురేషీని కేరళ పోలీసులు, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖురేషీకి ఐఆర్ఎఫ్‌తో సంబంధాలున్నాయని తేలితే కనుక ఆ సంస్థ నుంచి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే అవుతారు. జకీర్ నాయక్ బోధనలు తమకు స్ఫూర్తినిచ్చాయని బంగ్లాదేశ్‌లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం జకీర్‌పై నిఘా పెట్టింది. బుధవారం రాత్రి ఖురేషీని అరెస్ట్ చేయగా గురువారం సీబీడీ-బేలాపూర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు నాలుగు రోజుల ట్రాన్సిట్ కస్టడీ విధించింది. మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ప్రశ్నించిన తర్వాత అతడిని కేరళ పోలీసులు ప్రశ్నిస్తారు. తనను బలవంతంగా మతం మార్చి అనంతరం ఐఎస్‌లో చేరేలా చేశారని భర్త విన్సెంట్ అలియాస్ యాహియాతో కలిసి అదృశ్యమైన కేరళ యువతి మెరిన్ అలియాస్ సోదరుడు ఎబిన్ జాకోబ్(25) పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఖురేషీ, బెస్టిన్ ఉన్నారని జాకోబ్ కోచి పోలీసులకు వివరించారు. ఆయన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు ఖురేషీపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News