: "విమానయాన రంగంలోకి రాబోము" అనగానే 20 శాతం ఎగిరి దుమికిన వీఆర్ఎల్ షేర్లు


ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ లో కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా సేవలందిస్తున్న వీఆర్ఎల్ లాజిస్టిక్స్ సంస్థ ఈక్విటీ విలువ ఏకంగా 20 శాతం పెరిగింది. ఇన్వెస్టర్లు వీఆర్ఎల్ వాటాల కోసం ఎగబడ్డారు. లక్షలాది వాటాలు చేతులు మారాయి. ఇందుకు కారణం, సంస్థ పౌరవిమానయాన రంగంలోకి ప్రవేశించబోదని వెల్లడైన ప్రకటన. "కేంద్రం కొత్త విమానయాన విధానాన్ని ప్రకటించిన తరువాత, ఎంతో చర్చ జరిగింది. దేశంలో చిన్న ప్రాంతాల కనెక్టివిటీకి ప్రాధాన్యతను ఇస్తూ కేంద్రం ప్రతిపాదనలు తేగా, మా సంస్థ సైతం ఈ రంగంలోకి ప్రవేశించాలని భావించింది. అయితే, ఇప్పుడా ఆలోచన విరమించుకున్నాం. భారత ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన మాకు లేదు" అని వీఆర్ఎల్ లాజిస్టిక్స్ ప్రమోటర్ విజయ్ శంకేశ్వర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయం బయటకు రాగానే ఈక్విటీ విలువ అమాంతం పెరిగింది. వాస్తవానికి గత నెల 23న విమానయాన రంగంలోకి వీఆర్ఎల్ ప్రవేశిస్తుందన్న వార్తలు రాగా, అప్పటి నుంచి సంస్థ ఈక్విటీ ఒత్తిడిలో నడుస్తూ, 21 శాతం మేరకు నష్టపోయింది. ఈక్విటీలను విక్రయించేందుకే వీఆర్ఎల్ ఇన్వెస్టర్లు ప్రయత్నించారు. ఈ రంగంలోకి వస్తే విపరీతమైన ఒడిదుడుకుల కారణంగా లాభాల్లోని సంస్థ నష్టపోతుందన్న నిపుణుల ఊహాగానాలే ఇందుకు కారణం. గత సంవత్సరం ఏప్రిల్ లో ఐపీఓకు వచ్చిన వీఆర్ఎల్ రూ. 205పై ఒక్కో ఈక్విటీని జారీ చేయగా, కేవలం ఐదు నెలల్లోనే రెట్టింపునకు పైగా పెరిగిన వాటా విలువ సెప్టెంబరులో రూ. 479ని తాకింది. నేడు సంస్థ ఈక్విటీ రూ. 360 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News