: బోధనేతర విధుల్లో 47 మంది ఏపీ టీచర్లు!... డిప్యుటేషన్ రద్దు చేస్తామన్న గంటా!
సుప్రీంకోర్టు తలంటితే కాని తెలుగు రాష్ట్రాలు మేల్కోలేదు. పిల్లలకు పాఠాలు బోధించి వారిని భావి భారత పౌరులుగా తీర్చదిద్దుతామంటూ ఉపాధ్యయ వృత్తి చేపట్టిన పలువురు టీచర్లు ఆ తర్వాత వేరే వ్యాపకాల్లో నిమగ్నమైపోయారు. వీరికి ఆయా ప్రభుత్వాలు కూడా వత్తాసు పలుకుతూ కోరిన వారందరికీ డిప్యుటేషన్లు ఇస్తూ వారి సేవలను ఇతర పనులకు మళ్లించింది. అయితే ఉపాధ్యాయులకు ఇతర శాఖల విధులెందుకంటూ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో తెలుగు రాష్ట్రాలు రెండూ దీనిపై తమ వైఖరిని మార్చుకోక తప్పలేదు. ఇప్పటికే ఇతర విధుల్లోని టీచర్లను రిలీవ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించగా... తాజాగా ఏపీ కూడా ఆ పనిని చేపట్టక తప్పలేదు. ఉపాధ్యాయులుగా సర్కారీ విధుల్లో చేరిన టీచర్లలో 47 మంది ఇతర పనులు చేస్తున్నారని ఏపీ సర్కారు గుర్తించింది. వీలయినంత త్వరలో వీరికి సంబంధించిన డిప్యుటేషన్లను త్వరలోనే రద్దు చేయనున్నట్లు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం విజయవాడలో ప్రకటించారు.