: పొరపాటుకు బాధ్యత వహిస్తూ ట్రంప్ ఉపన్యాస రచయిత రాజీనామా... నో చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న డొనాల్డ్ట్రంప్ తన ప్రచార వేదికల్లో ఎటువంటి ఉపన్యాసాలు చేశారో అందరికీ తెలిసిందే. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. ట్రంప్‌కి అటువంటి ఉపన్యాసాలను అందించిన రచయిత మెరిడిత్ మెక్ఇవర్ ఇక ట్రంప్ కోసం రచనలు చేయబోనని నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఆయనను ఆకాశానికెత్తేస్తూ ట్రంప్ భార్య మెలానీ ట్రంప్ ఇటీవల ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రసంగం పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి. ఒబామా భార్య మిషెల్ ఒబామా గతంలో చేసిన ప్రసంగాన్నే మెలానీ ట్రంప్ కాపీ కొట్టి ప్రసంగించారని కామెంట్లు వచ్చాయి. దీంతో, ఆ ప్రసంగాన్ని రచించి ఇచ్చిన ట్రంప్ ఉపన్యాస రచయిత మెరిడిత్ మెక్ఇవర్ ఈ అంశం పట్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది. తాను పొరపాటు చేశానని చెబుతూ, ఆ ఉపన్యాసం పట్ల బాధ్యత వహిస్తూ మెరిడిత్ రాజీనామా చేశారు. మిషెల్ ఒబామా పట్ల అభిమానాన్ని చూపించే మెలానీ.. మిషెల్ ఒబామా గురించి తనకు పలుసార్లు చెప్పారని, ఆ కారణంగానే తాను ఉపన్యాసాన్ని మిషెల్ ఒబామా మాట్లాడిన వ్యాఖ్యలను రాశానని మెరిడిత్ పేర్కొన్నారు. అయితే, మెరిడిత్ చేసిన రాజీనామాను ట్రంప్ తిరస్కరించారు. సహజంగానే మనుషులు తప్పులు చేస్తారని ట్రంప్ హితవు పలికారు. చేసిన తప్పుల నుంచే కొత్త విషయాలు నేర్చుకోవాలని తనకు ట్రంప్ చెప్పారని మెరిడిత్ పేర్కొన్నారు. తాను రాసిచ్చిన ప్రసంగం పట్ల సానుకూలంగా వ్యవహరించినందుకు ఆయన ట్రంప్‌కు ధన్యవాదాలు చెప్పారు.