: టర్కీలో అత్యవసర పరిస్థితి విధింపు.. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
ఇటీవల టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటుతో ఆ దేశంలో కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చి తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ఆ దేశ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 50 వేల మందిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తయీప్ ఎర్డగాన్ ప్రభుత్వం తాజాగా ఆ దేశంలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు పేర్కొంది. టర్కీ జాతీయ భద్రతామండలి, కేబినెట్ సమావేశమైన అనంతరం ఈ మేరకు టర్కీ అధ్యక్షుడు తయీప్ ఎర్డగాన్ ఈ ప్రకటన చేశారు. సైనిక తిరుగుబాటుకు అమెరికాలో ఉంటూ ఉగ్రవాద సంస్థను నడిపిస్తోన్న ఫెతుల్లా గులెన్ అనే వ్యక్తే కారణమని నిన్న ఆ దేశ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తిరుగుబాటుకి ఉగ్రవాదుల హస్తం ఉందన్న అనుమానంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితి విధించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అంశంలో తాము వెనకాడబోమని టర్కీ ప్రభుత్వం తెలిపింది. దేశంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. టర్కీ జాతీయ భద్రతామండలి, కేబినెట్ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు.