: శంషాబాదు ఎయిర్ పోర్టు సమీపంలో ర్యాష్ డ్రైవింగ్... ఛేజ్ చేసి యువకులను పట్టేసిన పోలీసులు
హైదరాబాదు శివారులోని శంషాబాదు ఎయిర్ పోర్టు సమీపంలో నేటి తెల్లవారుజామున వేగంగా దూసుకువచ్చిన ఓ కారు పెను కలకలమే రేపింది. నగరం నుంచి ఎయిర్ పోర్టుకు దారి తీసే రోడ్డుపై కారుతో ప్రత్యక్షమైన కొందరు యువకులు తమ వాహనాన్ని పరిమితికి మించిన వేగంతో నడిపారు. కళ్లు చెదిరే స్పీడుతో వెళుతున్న సదరు కారుపై అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు వేగంగా స్పందించారు. కారును ఆపేందుకు యత్నించారు. అయితే ఆ యువకులు కారును ఆపకుండా ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు కూడా తమ వాహనంలో ఎక్కి దాదాపు 4 కిలో మీటర్ల మేర యువకుల కారును ఛేజ్ చేశారు. ఎట్టకేలకు కారును నిలువరించగలిగిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిమితికి మించిన వేగంతో కారును నడపడమే కాకుండా అడ్డు తగిలినా ఆపకుండా ముందుకెళ్లినందుకు పోలీసులు వారికి భారీ జరిమానా విధించారు.