: చరిత్రలో ఎప్పుడైనా ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారిందా?: చంద్రబాబు
చరిత్రలో ఎప్పుడైనా ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారిందా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, బిల్లు వీగిపోతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మొసలికన్నీరు కారుస్తోందని ఆయన మండిపడ్డారు. విభజన రోజున సరిగ్గా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తి ఉండేదా? అని ఆయన ప్రశ్నించారు. చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు నాటకాలాడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే ముందుగా సంతోషించేది తానేనని ఆయన తెలిపారు. ఈ బిల్లుపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఎంపీలు చర్చిస్తున్నారని ఆయన చెప్పారు.