: కింగ్ కాదు, కింగ్ మేకర్... సిద్ధూ, కేజ్రీవాల్ మధ్య కుదిరిన సీక్రెట్ డీల్ ఇదే!
అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ పదవికి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆయన భార్య కౌర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయడం వెనుక ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన ఆప్ లో చేరుతారని, ఆపై పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ తరఫున రంగంలోకి దిగుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కుదిరిన సీక్రెట్ డీల్ వివరాలు ఇవేనంటూ జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. తాను పంజాబ్ లో 'కింగ్'గా ఉండనని, 'కింగ్ మేకర్'లా మాత్రమే వ్యవహరిస్తానని సిద్ధూ కేజ్రీవాల్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకుగాను 4 కండిషన్స్ పెట్టినట్టు సమాచారం. అవి ఏంటంటే 1. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తరఫున సీఎం అభ్యర్థిగా ఉండబోను. 2. కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయను. 3. ఆప్ తరఫున స్వేచ్ఛగా పంజాబ్ అంతా తిరుగుతూ ప్రచారం చేస్తాను. 4. కనీసం నా భార్య కూడా పోటీ చేయదు సరికదా, పార్టీ పదవి కూడా వద్దు. ఈ నాలుగు కండిషన్స్ ను కేజ్రీవాల్ కు ముందే సిద్ధూ చెప్పి ఆపై బీజేపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అటు సిద్ధూ నుంచిగానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచిగానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.