: అమెరికాలో మరోసారి పోలీసులపై కాల్పులు ...ఈసారి న్యూయార్క్ లో!
అమెరికాలో మరోసారి పోలీసులపై కాల్పులు జరిగాయి. ఇటీవలే నల్లజాతీయుల నిరసన ప్రదర్శనలో డాలస్లో పోలీసులపై జరిపిన కాల్పులు కలకలం రేపాయి. ఆ తరువాత బ్యాటెన్ రోజ్లో ఓ దుండగుడు పోలీసులపై కాల్పులకు తెగబడి అలజడి రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు మరవకముందే మరోసారి ఈరోజు న్యూయార్క్లో పోలీసులపై జరిపిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఇద్దరు పోలీసు అధికారులు అక్కడి ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా కారులో వచ్చిన నలుగురు దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. అయితే, దుండగులు జరిపిన కాల్పుల నుంచి పోలీసులు తప్పించుకోగలిగారు. దుండగులు వారి కారుని అక్కడే వదిలేసి పరారయ్యారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులపై జరుగుతోన్న కాల్పుల నేపథ్యంలో వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.