: ప్రధానితో సమావేశం వేళ కొందరు సీఎంల ఫోన్లను తీసేసుకున్న భద్రతా సిబ్బంది... అవమానం జరిగిందన్న కేజ్రీవాల్
ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమైన వేళ, కేవలం కొంతమంది సీఎంల మొబైల్ పోన్లను మాత్రమే భద్రతా సిబ్బంది తీసేసుకోవడంపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు అవమానం జరిగిందని అన్నారు. దాదాపు 10 సంవత్సరాల తరువాత మూడు రోజుల క్రితం ప్రధాని అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తనతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్లను బయటే పెట్టాలని భద్రతా సిబ్బంది కోరారని, ఇద్దరమూ ఫోన్లు బయటపెట్టి వెళ్లామని అన్నారు. ఆపై బెంగాల్ లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, తనకెలా తెలియాలని ప్రశ్నించగా, ఆమె ఫోన్ ను తిరిగి ఇచ్చారని, తన ఫోన్ మాత్రం సభ ముగిసే వరకూ ఇవ్వలేదని ఆరోపించారు. ఒకరితో ఒకలా, మరొకరితో ఇంకోలా భద్రతా సిబ్బంది ప్రవర్తించి తమను అవమానించారని ఆరోపించారు. తాను, మమత మాట్లాడుతున్న వేళ, ప్రసంగాలను పలుమార్లు అడ్డుకున్నారని, తాము చెప్పేది వినే ఓపిక లేకుంటే అసలెందుకు పిలవాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు.