: కేవీపీ బిల్లును చర్చకే రానివ్వం!... కుండబద్దలు కొట్టిన బీజేపీ నేత హరిబాబు!
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు రేపు చర్చకు రానుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా కేవీపీ బిల్లుకు మద్దతు పలకాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదంటున్న బీజేపీ... రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఏ విధంగా ముందుకెళుతుందన్న విషయంపై ఉన్న సందిగ్ధత నేటి ఉదయం పటాపంచలైంది. ఏపీకి ప్రత్యేెక హోదా కంటే కూడా ఎక్కువే చేస్తున్నామని చెబుతున్న నరేంద్ర మోదీ సర్కారు... ప్రత్యేక హోదా ప్రకటనకు చాలా అడ్డంకులున్నాయని వాదిస్తోంది. ఇదే వాదనను భుజానికెత్తుకున్న ఆ పార్టీ ఏపీ శాఖకు చెందిన కీలక నేత హరిబాబు నేటి ఉదయం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న సందర్భంగా తన పార్టీ వైఖరిని కుండబద్దలు కొట్టారు. రాజ్యసభలో అసలు కేవీపీ బిల్లును చర్చకే రానివ్వమని ఆయన సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. హరిబాబు ప్రకటన ఏపీలో పెను కలకలమే రేపనుంది.