: 4 నెలల్లోనే అమాయకుల నుంచి ఆరితేరిన ఉగ్రవాదులుగా..!: హైదరాబాద్ ఉగ్ర కుట్రపై ఎన్ఐఏ నివేదిక
గడచిన మూడు వారాల వ్యవధిలో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్ లో ఉగ్ర కుట్ర ఆరోపణలపై అరెస్ట్ చేసిన యువకులు సామాన్యులేమీ కాదని, కేవలం 4 నెలల వ్యవధిలో ఆరితేరారని న్యాయస్థానానికి అందించనున్న నివేదికలో అధికారులు పేర్కొంటున్నారు. ఉగ్రవాదులను విచారించిన ఎన్ఐఏ, పలు ఆసక్తికర అంశాలపై తన రిపోర్టులో జోడించినట్టు తెలుస్తోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో పదుల సంఖ్యలో బాంబులు తయారు చేసే తెలివితేటలు వీరికి సొంతమని, వీరిని అరెస్ట్ చేయకుంటే పెను విధ్వంసమే జరిగి ఉండేదని, ఈ కుట్ర అత్యంత ప్రమాదకరమైనదని న్యాయస్థానానికి ఎన్ఐఏ వెల్లడించనుంది. వీరంతా ‘జున్ దుల్ ఖిలాఫత్ పీ బిలాద్ అల్ హింద్’ పేరిట ఓ గ్రూపుగా ఏర్పడి, రంజాన్ పర్వదినం ముగిసేలోపు తమ లక్ష్యం నెరవేర్చుకోవాలని, ఈ కుట్రను గుర్తించడంలో రెండు మూడు రోజులు ఆలస్యమైనా, అల్లకల్లోలం జరిగి వుండేదని, ఆపై వీరు దేశాలు దాటి సిరియాకు ప్రయాణమయ్యే వారని, అందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయని అధికారులు తెలియజేయనున్నట్టు సమాచారం. గతంలో తాము వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన వారితో పోలిస్తే, హైదరాబాద్ టీం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. విచారణకు సంబంధించిన మొత్తం వివరాల రిపోర్టును కోర్టుకు ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.