: పాక్ పై భీకర దాడికి సిద్ధమైన భారత వాయుసేన, చివరి క్షణంలో 'నో గో' ఆదేశాలు... కలకలం రేపుతున్న నాటి 'కార్గిల్' యుద్ధం డాక్యుమెంట్లు!
దాదాపు 17 సంవత్సరాల క్రితం, కార్గిల్ లో పాక్ సైన్యం చొరబడిన వేళ, పూర్తి స్థాయి యుద్ధం మరికొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశం వైమానిక సేనను నిలువరించింది. ఆనాటి భారత ప్లాన్, ఆపై దాన్ని ఆపిన విదానంపై ఓ టీవీ చానల్ ప్రత్యేక డాక్యుమెంట్లు సంపాదించి ప్రసారం చేసింది. 1999, జూన్ 13న తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో యుద్ధ విమానాలను తుపాకులు, మందుగుండు సామాగ్రితో వాయు సేన సిద్ధం చేయగా, మరికొన్ని నిమిషాల్లో పైలెట్లు టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న వేళ, పై అధికారుల నుంచి 'నో గో' ఆదేశాలు అందాయని, దీంతో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభం కాలేదని ఈ డాక్యుమెంట్ల వల్ల తెలుస్తోంది. అప్పటి రెండు దేశాల విదేశాంగ మంత్రులు జశ్వంత్ సింగ్, సర్తాజ్ అజీజ్ ల మధ్య ఢిల్లీలో జరిగిన చర్చలు విఫలం కాగానే ఈ దాడికి వాయుసేన ప్లాన్ వేసింది. జూన్ 12న చర్చలు జరుగగా, అజీజ్ పాక్ కు పయనం కాగానే, సాయంత్రం 4 గంటలకు పైలట్లను సమావేశపరిచిన వాయుసేన, రాత్రికి దాడులకు సిద్ధంగా ఉండాలని కోరింది. పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతానికి 4 ఫైటర్ జెట్లు, ఆపై రావల్పిండిలోని చక్లాలా ఎయిర్ బేస్ లో బాంబులు కురిపించి అక్కడ విధ్వంసం సృష్టించాలని తొలుత అధికారులు ఆదేశించినట్టు ఎయిర్ ఫోర్స్ 17 స్క్వాడ్రాన్ డైరీలో ఉన్నట్టు సదరు చానల్ వెల్లడించింది.