: సారీ చెబుతారా?... విచారణ ఎదుర్కొంటారా?: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న!


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు మెట్లెక్కిన రాహుల్ గాంధీపై మరో విచారణకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఈ మేరకు నిన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. తనపై విచారణ జరగాలా? వద్దా? అన్న విషయాన్ని సుప్రీం రాహుల్ గాంధీకే వదిలేసింది. వివరాల్లోకెళితే... గతంలో మహారాష్ట్రలోని భివాండీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భంగా మహాత్మా గాంధీ హత్యను ప్రస్తావించిన రాహుల్ గాంధీ... ఆ నేరం ఆరెస్సెస్ దేనని వ్యాఖ్యానించారు. దీనిపై అక్కడి స్థానిక కోర్టులో రాహుల్ గాంధీపై పిటిషన్ దాఖలైంది. తనపై కేసు నమోదు చేయాలన్న సదరు పిటిషన్ ను కొట్టివేయాలని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ల ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "చరిత్ర పరంగా మీరు చెప్పిన మాట వాస్తవమే కావచ్చు. అయితే ఒక వ్యక్తి చేసిన హత్యను ఒక సంస్థ మొత్తానికి మీరు ఆపాదించలేరు" అంటూ న్యాయమూర్తులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికాదని తేల్చేశారు. తన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెబితే ఇక్కడితో దీనిని వదిలేస్తామని, లేని పక్షంలో విచారణ తప్పదని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News