: టీఎస్సార్టీసీ ఎన్నికల్లో టీఎంయూ హవా!... వరుసగా రెండో దఫా ‘గుర్తింపు’ హోదా!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్సీర్టీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హవా కొనసాగింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలువడ్డాయి. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన టీఎంయూ వరుసగా రెండో దఫా గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైంది. రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్లుండగా పది రీజియన్లను గెలుచుకున్న టీఎంయూ... నల్లగొండ, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని అన్ని డిపోల్లోను విజయం సాధించిన ఆ కార్మిక సంఘం క్లీన్ స్వీప్ చేసింది. కార్మికులు గంపగుత్తగా ఆ కార్మిక సంఘానికే ఓట్లేశారు. వెరసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైన టీఎంయూ... ఒక్క ఖమ్మం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైంది. టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో టీఎంయూను ఈ దఫా ఎలాగైనా మట్టికరిపించాల్సిందేనన్న గట్టి పట్టుదలతో బరిలోకి దిగిన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్ డబ్ల్యూఎఫ్) వ్యూహాలు సత్ఫలితాలివ్వలేదు. ఇక ఈ రెండు కార్మిక సంఘాలతో పాటు బరిలోకి దిగిన మరో ఆరు కార్మిక సంఘాలు అసలు ఖాతానే ఓపెన్ చేయలేకపోయాయి.