: 'కబాలి' రిలీజ్ రోజు ఆఫీసులకు సెలవు


రజనీకాంత్ 'కబాలి' సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దేశ విదేశాల్లో అత్యధిక ధియేటర్లలో ఈ నెల 22న కబాలిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, స్టార్ హోటళ్లలోని ఫంక్షన్ హాళ్లలో కూడా ఈ సినిమాను ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కబాలి ఫీీవర్ ను క్యాష్ చేసుకునేందుకు సినీ నిర్మాతలు, బయ్యర్లు వినూత్న పద్ధతులు అవలంబిస్తుండగా, ఈ సినిమాను ఆఫీసులకు డుమ్మా కొట్టి మరీ వీక్షిస్తారని పలు సంస్థల యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీంతో కబాలి రిలీజ్ రోజున త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లోని కొన్ని కంపెనీలు ఆఫీసుల‌కు సెల‌వు ప్ర‌క‌టించేశాయి. ఈ సినిమా చూసేందుకు ఉద్యోగులు సిక్ లీవ్ అంటూ మెసేజ్ పెట్టేసి, ఫోన్ స్విచాఫ్ చేయ‌డం ఖాయమని భావించిన ఆఫీసు యాజమాన్యాలు ఉద్యోగులకు అలా అబద్ధమాడే అవకాశం ఇవ్వడం కంటే సెలవు ప్రకటించి వారికి మానసికోల్లాసం కలిగించాలని భావించాయి. దీంతో చెన్నైలోని ఫైండ‌స్‌, బెంగ‌ళూరులోని ఓప‌స్ కంపెనీలు ఆ రోజు త‌మ కార్యాల‌యాల సెలవు ప్రకటించామని తెలిపాయి. ఇక కోయంబ‌త్తూర్‌ లోని సాఫ్ట్‌ వేర్ కంపెనీ ప‌యోడా 300 మంది ఉద్యోగులకు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టికెట్లు ఆఫ‌ర్ చేసి ఈ సంస్థ ఉద్యోగుల్లో ఉత్సాహం నింపింది. మరోవైపు చెన్నైలో ఫ్లాష్ మాబ్ పేరిట యువకులు క‌బాలి థీమ్ డ్యాన్స్ చేసి సందడి చేశారు. క‌బాలి విడుదల రోజు ఆ సినిమా థీమ్ తో కొత్త సొబగులద్దుకున్న ఎయిర్ ఏషియా విమానం బెంగ‌ళూరు నుంచి చెన్నైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. దీంతో కబాలి రిలీజ్ పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న అభిమానులను కబాలి మెప్పిస్తాడనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పొరపాటున ఈ సినిమా మెప్పించకపోతే పరిస్థితి ఏంటనే అనుమానం సగటు అభిమానులను వేధిస్తోంది.

  • Loading...

More Telugu News