: ఢిల్లీలో సంచలనం... కార్పొరేట్ శాఖ డీజీ బన్సల్ అరెస్టుతో భార్య, కుమార్తె ఆత్మహత్య
మూడు రోజుల క్రితం అవినీతి ఆరోపణలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ డైరెక్టర్ జనరల్ బీకే బన్సల్ ను సీబీఐ అరెస్ట్ చేయగా; నేడు ఆయన భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఢిల్లీలో సంచలనం కలిగించింది. 16న ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన ఓ కంపెనీకి మేలు చేకూర్చేందుకు రూ. 9 లక్షలు లంచం తీసుకుంటుండగా, వలపన్నిన సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసింది. ఆపై ఆయనకు చెందిన ఆరు స్థలాలపై దాడులు చేసి రూ. 54 లక్షలను సీజ్ చేసింది. జరిగిన ఘటనలకు మనస్తాపం చెందిన ఆయన భార్య, కుమార్తెతో కలసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.