: ఆశలు వద్దు... 70 శాతం స్టార్టప్ సంస్థలు విఫలమే: ఇన్ఫోసిస్ కో ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్ సంచలన వ్యాఖ్య
స్టార్టప్ ఇండియాలో భాగంగా ప్రారంభమవుతున్న కంపెనీల్లో 70 శాతం పూర్తిగా విఫలమవుతాయని, మరో 20 శాతం నిలబడ్డా, దీర్ఘకాలంలో వృద్ధి బాటలో పయనించలేవని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ప్రస్తుత సీఐఐ అధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కేవలం 5 నుంచి 10 శాతం కంపెనీలు మాత్రమే ఎదిగి పెద్ద కంపెనీలుగా మారుతాయని అంచనా వేశారు. బెంగళూరులో 12వ ఇన్నోవేషన్ సదస్సు జరుగుతుండగా, గోపాలకృష్ణన్ పాల్గొని ప్రసంగించారు. 100 కంపెనీల్లో 10 మాత్రమే నిలదొక్కుకుంటాయని చెప్పడం ప్రమాదకర పరిస్థితి ఉందని చెప్పడం కాదని, అభివృద్ధి పరిణామ క్రమంలో సహజంగా జరిగేదేనని వివరించారు. విఫలమైన కంపెనీల విషయంలో ఎందుకు అలా జరిగిందో పాఠాలు నేర్చుకుని ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేవలం మూడు నుంచి ఐదేళ్ల క్రితం స్టార్టప్ లుగా ఉన్న ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ సంస్థల గురించి ఇప్పుడు ఎంతో మాట్లాడుకుంటున్నామని గుర్తు చేశారు. పేటీఎం, ఫ్రెంచ్ డెస్క్ వంటి కంపెనీలు ఎన్నో వృద్ధి పథంలో పయనిస్తున్నాయని, మరో నాలుగైదేళ్లలో కొన్ని కొత్త కంపెనీల గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. రవాణా, ఆతిథ్యం, లాజిస్టిక్స్ రంగంలోని కంపెనీలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని క్రిస్ తెలిపారు.