: సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు: సీపీ మహేందర్‌రెడ్డి
బోనాలను శాంతియుతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితో పాటు పలువురు అధికారులతో సీపీ మహేందర్‌రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. దేవాలయాల ప్రతినిధులు, ప్రజలు పోలీసులకి సహకరించాలని ఆయన కోరారు. బోనాల ఊరేగింపు మార్గాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బోనాల కోసం 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్టాడుతూ.. బోనాల కోసం వివిధ ప్రాంతాల్లో పనులకు రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. చెత్తను తొలగించేందుకు అదనంగా 500 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారని పేర్కొన్నారు. మొబైల్ మరుగు దొడ్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరుస్తున్నట్లు పేర్కొన్నారు.