: ఈరోజు నా జీవితం సార్థకమైంది : గోదావరి, కృష్ణా పవిత్ర సంగమం వద్ద సీఎం చంద్రబాబు


‘ఈరోజు ఉన్నంత ఆనందంగా నా జీవితంలో ఎప్పుడూ లేను. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో నా జీవితం సార్థకమైంది’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా నదిలో కలుస్తున్న గోదావరి జలాలకు పసుపు, కుంకుమలతో పూజ చేసిన చంద్రబాబు హారతిచ్చారు. సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, నదుల అనుసంధానం కోసం పవిత్రమైన భావనతో పనిచేశానని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే తనకు తృప్తిగా ఉంటుందని, ఈ నీటి ద్వారా మంచి పంటలు పండించాలని, అందరూ ఆనందంగా ఉండాలని అన్నారు. ‘గోదావరి, కృష్ణమ్మ దరికి చేరింది. ఇది ఒక చరిత్ర. గోదావరి జీవనది, కృష్ణమ్మ ప్రాణనాడి.. ఇక మనకు దిగులులేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాము, సరైన ప్రణాళిక, పట్టుదలతో ఇది సాధ్యమైంది. పట్టిసీమ ద్వారా ముందుగా రెండు కాలువల్లోకి నీరు మళ్లిస్తామని, శ్రీశైలం నుంచి నీళ్లు వస్తే రాయలసీమ రత్నాల సీమ అవుతుంది’ అన్నారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News