: టీఆర్ఎస్ ఎంపీలను చూసి సిగ్గు తెచ్చుకోండి: ఏపీ ఎంపీలకు సినీ నటుడు శివాజీ సలహా
తమ హక్కుల సాధనకు, రాష్ట్ర డిమాండ్లను తీర్చేందుకు ఎంతో కృషి చేస్తూ, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకుంటున్న టీఆర్ఎస్ ఎంపీలను చూసి ఏపీ ఎంపీలు సిగ్గు తెచ్చుకోవాలని హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హైకోర్టు కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో గట్టి నిరసన తెలపాలని నిర్ణయించారని, వారు వెల్ లోకి దూసుకుపోవాలని భావిస్తున్నారని, హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు ఒక్కసారైనా అటువంటి పని చేయలేదని ఆయన ఆరోపించారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని, అలా ఇవ్వకుంటే, తదుపరి జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఏపీకి అన్యాయం జరిగిన పాపంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందని, దాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. బీజేపీ పాలనా పగ్గాలు చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా, నేతలు సిగ్గూ శరం లేకుండా ప్రవర్తిస్తూ, హోదా విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ, ఇంకా కాంగ్రెస్ ను తిడుతున్నారని శివాజీ ఆరోపించారు. ప్రజలు పరిస్థితులను గమనిస్తున్నారని అన్నారు. ఎంపీలు చేస్తున్నది ప్రజాసేవ కాదని, ముమ్మాటికీ వ్యాపారమేనని, ప్రైవేటు బిల్లును ఎలా తప్పించుకోవాలని తెలుగుదేశం చూస్తుండటం, అత్యంత బాధాకరమని అన్నారు. బిల్లు వస్తే చూద్దామని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పడంతో బిల్లు రాకుండా అడ్డుకుంటారన్న అనుమానాలు పెరుగుతున్నాయని అన్నారు. బీజేపీ నేతలు ఒంటినిండా విషం నింపుకున్నారని ఆరోపించారు.