: ఏపీ ఎంసెట్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన వారికి, తెలంగాణ ఎంసెట్లో టాప్ ర్యాంకులు... లీకేజీ కలకలం!


తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం ముందే లీక్ అయిందన్న వార్తలు వెలుగులోకి వచ్చి విద్యార్థుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏపీ ఎంసెట్ రాసి వేలల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులకు, తెలంగాణ ఎంసెట్లో వందలోపు ర్యాంకులు రావడంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్ - ఎంసెట్ 2లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు ఇంటర్ చదువులో అత్యున్నత ప్రతిభనేమీ కనబరచలేదని తెలుస్తుండటంతో, ప్రశ్నాపత్రం ముందే లీక్ అయినట్టు మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ర్యాంకులు తెచ్చుకున్న వారిలో చాలా మంది ఎంసెట్ కు వారం రోజుల ముందు కోచింగ్ సెంటర్ల నుంచి మానేసినట్టు, అక్కడే కోచింగ్ తీసుకున్న ఇతర విద్యార్థుల నుంచి ఇప్పుడు ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. లీకైన ప్రశ్నాపత్రాలతో ఎంసెట్ కు సిద్ధమైయ్యేందుకు వీరు మానేశారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 8 మందికి 100 లోపు ర్యాంకులు రావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. కోచింగ్ సెంటర్లలో ప్రతిభ చూపలేకపోయిన వీరికి టాప్ ర్యాంకులు రావడంపై అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ పేపర్ ను ముందే బయటకు పంపి దళారులు కోట్లు దండుకున్నారని, ఎంక్వయిరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News