: తెలంగాణలో జోరుగా కొనసాగుతోన్న హరితహారం.. పాల్గొంటున్న మంత్రులు, అధికారులు
తెలంగాణని హరితవనంలా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. తెలంగాణ మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలని ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని పాత, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం శాసన మండలి, శాసనసభల్లోనూ వారు ఈరోజు మొక్కలు నాటారు. వరంగల్ జిల్లా హన్మకొండ జయనర్సింగ్ కళాశాలలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు లక్ష్మారెడ్డి, చందూలాల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఆ జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్ ఉపరితల గనిపై లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.