: 22వ తేదీ శుక్రవారం, ఏపీకి అత్యంత కీలకం... హోదాపై రాజ్యసభలో ఓటింగ్... ఏం జరుగుతుంది?
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రైవేట్ మెంబర్ బిల్లు 22వ తేదీ శుక్రవారం నాడు చర్చ, ఓటింగ్ కు రానుండటంతో సర్వత్ర ఆసక్తి, ఉత్సుకత నెలకొన్నాయి. స్పెషల్ స్టేటస్ పై బీజేపీ ఎన్నికలకు ముందు ఓ మాట, ఆపై మరో మాట మార్చి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో చర్చపై బీజేపీ ఎలా అడుగులు వేస్తుందన్న విషయమై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. కాంగ్రెస్ మాత్రం, తమ హయాంలో హామీ ఇచ్చామని, బీజేపీ సైతం ప్రత్యేక హోదాకు అప్పట్లో అంగీకరించి, ఇప్పుడు మాట తప్పిందని ఆరోపిస్తూ, ఓటింగ్ పై విప్ ను కూడా జారీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ బిల్లుకు తెలుగుదేశం, రాష్ట్ర బీజేపీ ఎంపీలు సైతం అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ నేపథ్యంలో బిల్లు ఏమవుతుందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. బిల్లుకు అనుకూలంగా ఓటు పడుతుందా? రాష్ట్రానికి మేలు కలుగుతుందా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మొత్తం 245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఎన్డీఏకు 72 మంది సభ్యులున్నారు. బీజేపీ 54, టీడీపీ 6, శిరోమణి అకాలీ దళ్ 3, శివసేన 3, పీడీపీ 2, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, నాగా పీపుల్స్ ఫ్రంట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథావలే), సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన యూపీఏ తరఫున 66 మంది సభ్యులుండగా, కాంగ్రెస్ కు 60, డీఎంకే 4, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ లకు ఒక్కో సభ్యుడి చొప్పున బలముంది. జనతా పరివార్ పార్టీకి 15 మంది సభ్యుల బలముండగా, జనతాదళ్ తరఫున 10 మంది, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున ముగ్గురు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు. ఇక ఇతర పార్టీల్లో సమాజ్ వాదీ 19, అన్నాడీఎంకే 13 తృణమూల్ కాంగ్రెస్ 12, బిజూ జనతాదళ్ కు 8, సీపీఐ (ఎం) కు 8, బీఎస్పీకి 6, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి 5, టీఆర్ఎస్ కు 3, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, వైఎస్ఆర్ సీపీలకు ఒక్కో సభ్యుడి చొప్పున బలముంది. వీరు కాక 10 మంది నామినేటెడ్ సభ్యులు, నలుగురు ఇండిపెండెంట్లు ఉండగా, మరో సీటు ఖాళీగా ఉంది. ఏపీకి హోదా బిల్లుపై అటు ఎన్డీయే, ఇటు యూపీఏకు ప్రత్యక్షంగా మద్దతు పలకని అన్నాడీఎంకే, సమాజ్ వాదీ, తృణమూల్ పార్టీలు ఏ వైపు నిలబడతాయన్న విషయం అత్యంత ఆసక్తికరం. సీపీఐ, సీపీఎం, వైసీపీ, బీఎస్పీలు కాంగ్రెస్ కు మద్దతిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం ఆరుగురు సభ్యులు సైతం తప్పనిసరిగా ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇదే జరిగితే అధికార పక్షానికి తీవ్ర ఇబ్బందే. ఏదిఏమైనా మరో మూడు రోజుల్లో రాజ్యసభలో ప్రత్యక హోదా బిల్లుపై ఎలాంటి చర్చ జరుగుతుందో, ఓటింగ్ ఫలితమేంటోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.