: పొరపాటున పక్కింటి డోరు తడితే, కాల్చి పారేసిన ఇంటి యజమాని!
సరదా కోసం మందు కొట్టి, ఆ మత్తులో తప్పు చేస్తే ఏమవుతుందో తెలిపే సంఘటన ఇది. మద్యం మత్తులో పొరపాటున పక్కింటి తలుపు తట్టినందుకు, దొంగెవడో వచ్చాడనుకుని తుపాకితో కాల్చి చంపాడు ఆ ఇంటి యజమాని. అమెరికాలోని మసాచుసెట్స్ పరిధిలోని చికోపీ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, ఇద్దరు టీనేజర్లు పార్టీ చేసుకుని మరో స్నేహితుడి ఇంటికి బయలుదేరారు. మద్యం మత్తులో ఓ 15 ఏళ్ల యువకుడు స్నేహితుడి ఇంటికి బదులుగా, పక్కనే ఉన్న మరో ఇంటి డోర్ తట్టాడు. ఈ క్రమంలో కాస్త బలంగా తట్టడంతో డోర్ అద్దం పగిలింది. ఇంటి యజమాని, 42 ఏళ్ల జెఫ్రీ లోవెల్, తనను దోచుకునేందుకు ఎవరో వచ్చారని భావిస్తూ, తలుపుకూడా తీసి చూడకుండా తుపాకితో కాల్చాడు. తూటా ఆ యువకుడి పొట్టలోకి దూసుకెళ్లింది. ఆపై అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. జెఫ్రీపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని వివరించారు. జెఫ్రీకి తుపాకులంటే చాలా పిచ్చని అతని ఫేస్ బుక్ ఖాతా వెల్లడిస్తోందని, అందువల్లే ముందూ వెనుకా చూడకుండా కాల్చాడని తెలిపారు.