: నాడు ధనవంతుడు, నేడు పూట తిండికి గతిలేని నిర్భాగ్యుడు... ముంబై చైల్డ్ యాక్టర్ దీనగాధ!
ఎంతో పేదరికం నుంచి ఎదిగి కోటీశ్వరులుగా మారి నలుగురికీ ఆదర్శవంతంగా నిలిచిన ఎన్నో కథలు ఈ ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇదే ప్రపంచంలో ఒకనాడు బాగా బతికి, ఆపై చితికి వీధిన పడ్డ కుటుంబాలూ ఎన్నో! అటువంటిదే అలనాటి ముంబై చైల్డ్ యాక్టర్ దీనగాధ. రెండు రోజుల నాడు హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్ బుక్ పేజీలో అతని పేరును వెల్లడించకుండా, ఈ కథను ఉంచగా, ఇప్పుడది వైరల్ గా మారింది. "అప్పట్లో నేను ధనవంతుడినే. ఓ పెద్ద ఇంట్లో ఉండేవాళ్లం. ప్రముఖులు, కోటీశ్వరులతో మాత్రమే పార్టీలు జరుగుతుండేవి. రోజుకు 10 మందికి భోజనాలు పెట్టించగల స్తోమత ఉండేది మాకు. నేడు నాకోసం ఒక్క పూట భోజనానికీ గతి లేకుండా పోయింది. నేను చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసే సమయంలో ఎన్నో చిత్రాల్లో ప్రముఖ నటీనటులతో నటించాను. నా తల్లిదండ్రుల మరణంతో కష్టాలు మొదలయ్యాయి. అవకాశాలు తగ్గాయి. జేబులో డబ్బులు లేకుంటే, ఎంత టాలెంట్ ఉన్నా దానికి గుర్తింపు లభించదు. కొన్నిసార్లు ముఖాన్ని కూడా మరచిపోతారు" అని ఎన్నో చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన ఆయన అన్నారు. ముంబై బీచ్ రోడ్లపై సమోసా, చపాతీని భోజనంగా తింటూ గడుపుతున్న ఇతను, భవిష్యత్తుపై మాత్రం తనకింకా ఆశలు చావలేదని, ఏనాటికైనా పాత పొజిషన్ కు వస్తానని నమ్మకంగా చెబుతున్నారు. ఆ రోజు రావాలని మనమూ ఆశిద్దాం.