: పాత మాటనే వల్లె వేసిన వైఎస్ జగన్!... ఒకట్రెండేళ్లలో అధికారంలోకి వస్తానని ప్రకటన!
గడచిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఫలితంగా అప్పటిదాకా విజయం సాధిస్తుందన్న అంచనాలున్న వైసీపీ విపక్షంలో కూర్చోగా, నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ అధికార పీఠం ఎక్కింది. మళ్లీ ఎన్నికలు జరిగేదాకా టీడీపీ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలే లేవు. అంతేకాకుండా వైసీపీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 20 మంది పార్టీ మార్చేశారు. వెరసి అసెంబ్లీలో టీడీపీ బలం మరింత ఇనుమడించగా, వైసీపీ బలం హారతిలా కరిగిపోయింది. అయినా... ఒకటి, రెండేళ్లలో తానే అధికారంలోకి వస్తానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పలుమార్లు ప్రకటించారు. తాజాగా నిన్న విశాఖ జిల్లా వెళ్లిన సందర్భంగా ఆయన నోట ఈ పాత మాట వినిపించింది. జిల్లాలోని పాయకరావుపేట, మునగపాకల్లో పర్యటించిన జగన్... గడపగడపకూ వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునగపాక మండలం పాల్మన్ పేటలో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గడచిన ఎన్నికల్లో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించిన జగన్... రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు దుష్టపాలన ఇంకెంతో కాలం సాగదన్న ఆయన... ఒకట్రెండేళ్లలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు.