: సెన్సార్ బోర్డు నుంచి కబాలి లీక్... తమ ప్రమేయం లేదంటూ లీక్ పై ఆందోళన వ్యక్తం చేసిన నిహ్లానీ
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలకు ఐదు రోజులకు ముందే ఆన్ లైన్లో లీకైందన్న వార్తలు చిత్ర పరిశ్రమను కుదుపుతున్నాయి. ఈ సినిమా సెన్సార్ కు వెళ్లినప్పుడు లీక్ అయినట్టు వార్తలు రావడంతో సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహ్లానీ స్పందించారు. సినిమా లీక్ విషయంలో తమకు సంబంధం లేదని, పెద్ద చిత్రాలు లీక్ కావడం పట్ల ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ చిత్రాన్ని చెన్నైలో సెన్సార్ చేశారని గుర్తు చేసిన ఆయన, ముంబైలోని తమ కార్యాలయానికి సంబంధం లేదని అన్నారు. స్టార్ హీరోల చిత్రాలు లీక్ అయితే, వసూళ్లు ఎంత వరకూ తగ్గుతాయో తాను చెప్పలేనని, చిన్న సినిమాలు అయితే మాత్రం భారీగా నష్టపోతాయని భావిస్తున్నానని అన్నారు. కాగా, ఇటీవల పలు కొత్త చిత్రాలు విడుదలకు ముందుగానే ఆన్ లైన్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'సుల్తాన్', దానికన్నా ముందు 'ఉడ్తా పంజాబ్', ఆపై 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' చిత్రాలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. కబాలీ లీక్ పై నిర్మాతలు చెన్నై హైకోర్టును ఆశ్రయించగా, లింకులు ఉన్న వెబ్ సైట్లను మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.