: పశ్చిమబెంగాల్లో 653 బాంబులు స్వాధీనం.. వెయ్యిమందికిపైగా అరెస్ట్
పశ్చిమబెంగాల్ పోలీసులు భారీగా బాంబులు స్వాధీనం చేసుకున్నారు. బుర్ద్వాన్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు 653 క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకుని 1,117మందిని అదుపులోకి తీసుకున్నారు. కల్యాణ్పురా గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో భారీగా బాంబులు ఉన్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడిచేసి ఓ డ్రమ్ములో దాచి ఉంచిన 123 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల్లో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో కంద్రా ప్రాంతంలోని ఓ క్లబ్బులో దాచి ఉంచిన 107 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి 423 బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు బుర్ద్వాన్ ఎస్పీ కునాల్ అగర్వాల్ తెలిపారు. వీటితోపాటు 26 ఆయుధాలు, 28 కార్ట్రిడ్జ్లు, గంజాయి, విదేశీ మద్యాన్ని సీజ్ చేసినట్టు వివరించారు.