: పుదుచ్చేరిలో తల్లి పాల ‘ఏటీఎం’!


ఏటీఎం అంటే అవసరానికి డబ్బులు డ్రా చేసుకునేదిగానే తెలుసు. గల్ఫ్ దేశాల్లో బంగారం ఏటీఎంలు కూడా ఉన్నాయని విన్నాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భారత్‌లో నీళ్ల కోసం ఏటీఎం సర్వీసులు తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఆ కోవకు చెందినది కాదు. ఇది తల్లి పాలను అందించే ఏటీఎం. నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులను రక్షించేందుకు పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్ మెర్) తల్లి పాలు అందించే ఏటీఎంను ప్రారంభించింది. ‘అముధం తైప్పల్ మైయమ్(ఏటీఎం)గా పిలిచే ఈ ఏటీఎంలు, నెలలు నిండకుండా పుట్టే శిశువులకు తల్లిపాలు ఇచ్చి వారి ప్రాణాలు కాపాడతాయి. అంతేకాదు తల్లులకు ‘బ్రెస్ట్ ఫీడింగ్’పై కౌన్సెలింగ్ కూడా ఇస్తాయి. ‘‘జిప్ మెర్ లో ప్రతి నెల 15 వందల మంది పుడుతున్నారు. వీరిలో 30 శాతం మంది నెలలు నిండాకుండానే తక్కువ బరువుతో పుడుతున్నారు. దీంతో వీరి ప్రాణాలు ఆపదలో పడుతున్నాయి. వీరికి తల్లిపాల అవసరం ఎంతో ఉంటుంది. అందుకనే నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్-ఎన్ఐసీయూ)లో గత బుధవారం తల్లిపాల ఏటీఎంను ఏర్పాటు చేశాం’’ అని జిప్ మెర్ డైరెక్టర్ ఎస్‌సీ పరిజా తెలిపారు. ఇటువంటి ఏటీఎంలను అన్ని ఎన్ఐసీయూలలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News