: ఏంటీ వేషాలు?: పాక్ క్రికెటర్లపై కన్నెర్రచేసిన కుక్
పాక్ క్రికెటర్ల తీరుపై ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లార్డ్స్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టుపై విజయం సాధించగానే పాక్ ఆటగాళ్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. మ్యాచ్ గెలవగానే పాక్ ఆటగాళ్లు అందరూ వరుసగా నిల్చుని సెల్యూట్ చేశారు. ఆ తరువాత గ్రౌండ్ లోనే నేలపై పుషప్స్ చేశారు. దీనిని అంతా చిత్రంగా చూశారు. అయితే సీరిస్ కు ముందు పాక్ ఆటగాళ్లకు మిలిటరీ కఠిన శిక్షణ ఇచ్చింది. దీంతో విజయం సాధించగానే...ఈ విజయం మీవల్లే సాధ్యమైందంటూ సింబాలిక్ గా చెప్పేందుకు మిస్బా సేన ఇలా చేసింది. దీనిపై ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ మండిపడ్డాడు. విజయం సాధించామంటూ గ్రౌండ్ లో సెల్యూట్ కొట్టి, పుషప్స్ తీయడం ఏంటి? అని ప్రశ్నించాడు. ఇది చాలా చిత్రంగా ఉందని పేర్కొన్నాడు. ఓ జట్టు విజయం సాధించిన తరువాత ఇలా చేయడం తానెప్పుడూ, ఎక్కడా చూడలేదని పేర్కొన్నాడు. జంటిల్ మన్ గేమ్ క్రికెట్ లో ఇలాంటి కొత్త పోకడలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే తమ జట్టు ఓటమి పట్ల విచారం వ్యక్తం చేసిన కుక్, షాట్ల ఎంపికలో చేసిన పొరపాట్లే కొంప ముంచాయని చెప్పాడు. రెండోటెస్టులో తప్పులు సరిదిద్దుకుని విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.